భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌‌పోర్టు, భూ సర్వేలపై కలెక్టర్‌‌ పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌‌పోర్టు, భూ సర్వేలపై కలెక్టర్‌‌ పరిశీలన

భద్రాద్రికొత్తగూడెం/ భద్రాచలం/ పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌‌పోర్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌‌పోర్ట్‌‌ అథారిటీ ఆఫ్‌‌ ఇండియా (ఏఏఐ) టెక్నికల్‌‌ బృందం రెండోరోజైన మంగళవారం పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. సుజాతనగర్‌‌, సీతంపేట, దుమ్ముగూడెం, ములకలపల్లి, పాల్వంచ, దమ్మపేట, పెనగడప, చాపరాలపల్లి ప్రాంతాల్లో కలెక్టర్‌‌ అంకిత్‌‌తో కలిసి భూమి విస్తీర్ణం, రన్‌‌వేకు అనుకూలత, రహదారులు, రైల్వే, అటవీ ప్రాంతాలు, నీటి ప్రవాహాలు, పర్యావరణం, వాతావరణ పరిస్థితులను పరిశీలించింది.

సేకరించిన వివరాలను విశ్లేషించి సుమారు ఎనిమిది వారాల్లో నివేదిక అందిస్తామని బృందం తెలిపింది. అనంతరం కలెక్టర్​ పాల్వంచ మండలం భోజ్యాతండాలో రోవర్‌‌ పరికరాలతో నిర్వహిస్తున్న భూ సర్వేను పరిశీలించారు. రోవర్‌‌ సర్వేలతో వాస్తవ భూ సరిహద్దులు, విస్తీర్ణాన్ని ఖచ్చితంగా గుర్తించవచ్చని తెలిపారు. భూ రికార్డులతో వివరాలను అనుసంధానం చేసి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. భోజ్యాతండాలో 450 ఎకరాల్లో సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 77 సర్వే నంబర్ల పరిధిలో 88 ఎకరాల్లో రీసర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు.